Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 24

' Story of Tataki !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

తతః ప్రభాతే విమలే కృత్వాహ్నికం అరిందమౌ |
విశ్వామితం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ ||

తా|| శత్రువులను అంతముచేయగల వారిద్దరూ అప్పుడు నిర్మలముగా నున్న ప్రభాతసమయములో ప్రాతఃకాల దైవిక కర్మలను ముగించుకొని విశ్వామిత్రుని అనుసరించి గంగా తీరమునకు చేరిరి.

బాలకాండ
ఇరువది నాలుగవ సర్గము.
(విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగాసరయూనదుల సంగమప్రదేశము గురించి , మలద కరూశ ప్రదేశములగురించి తాటక గురించి తెలుపుట)

త్రువులను అంతముచేయగల రామలక్ష్మణుకు ఇద్దరూ అప్పుడు నిర్మలముగా నున్న ప్రభాతసమయములో ప్రాతఃకాల దైవిక కర్మలను ముగించుకొని విశ్వామిత్రుని అనుసరించి గంగా తీరమునకు చేరిరి.

అచట వ్రతనిష్ఠాపరులు మహాత్ములు అయిన ఆ మునులు అందఱూ ఒక చక్కని నావని తెప్పించి మహాముని విశ్వామిత్రుని తో ఇట్లనిరి. 'ఓ మహామునీ మీరు ఇంకా ఈ రాజకుమారులు ఈ నావని ఎక్కుడు. ఆలస్యముకాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు'. ఆ మునులను పూజించి విశ్వామిత్రుడు అట్లే అని పలికి రామలక్ష్మణులతో గూడి సాగరములో సంగమమగు ఆ గంగానదిని దాటెను.

నావ నదియొక్క మధ్యభాగమున చేరగానే అలల తాకిడి కి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు " ఈ నదీ మధ్యభాగమున జలతరంగముల ఘర్షణవలన ఉత్పన్నమైన అ మహాధ్వనికి కారణమేమి" అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను. కుతూహలముతో కూడిన శ్రీరాముని మాటలను విని అంతట ధర్మాత్ముడైన ఆ విశ్వామిత్రుడు ఆ మహాధ్వని యొక్క కారణము తెలుపసాగెను.

'రామా ! ఓ నరశార్దూలా ! బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఓక సరస్సు నిర్మించెను. అది మానససరస్సు అని పేరుతో ప్రసిద్ధి పొందినది. సరయూ నది అ మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యని చుట్టి ప్రవహించుచున్నది. సరస్సునుంచి పుట్టినది కావున ఇది సరయూ అని పేరుపొందినది. బ్రహ్మ సరస్సునుంచి పుట్టినందువలన ఇది పుణ్యమైన నది. సరయూనది గంగానదిలో సంగమించునప్పుడు నీటి తరంగముల ఘర్షణవలన అ మహాధ్వని ఉద్భవించుచున్నది. ఓ రామా ఈ నదీ ద్వయములకు శ్రద్ధగా ప్రణామము చేయుము'.

అతి ధార్మికులైన వారిద్దరూ ఆ రెండు నదులకూ నమస్కరించి దక్షిణ తీరము చేరి వేగముగా ముందుకు నడువ దాగిరి. జనసంచారము లేని దట్టముగా నున్నఆ అడవిని చూచి , ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు ముని పుంగవుని ఇట్లు అడిగెను.

'అహో ! ఈ వనము దుర్గమమైనది, కీచురాళ్ళ గణముల నాదములతో నిండినది. భయంకరమైన మృగములతో నిండినది, భయంకరమైన కూతలు గల పక్షులతో నిండినది. సింహ వ్యాఘ్ర వరాహ ఏనుగులు శ్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర నల్లమద్ది , ఎర్రమద్ది, చెట్లతోనూ మారేడు వృక్షములతోనూ అట్లే తదితర వృక్షములతో నిండియున్న ఈ కాననము పేరేమి?

మహాతేజోమయుడైన విశ్వామిత్రుడు శ్రీరామునితో ఇట్లుపలికెను. 'వత్సా ! ఈ దుర్గమమైన వనము ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమా! పూర్వకాలమున ఇచట 'మలదము' 'కరూశము' అను రెండు ప్రదేశములు దేవ నిర్మితములై యుండెను. అవి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండెన'.

'ఓ రామా ! పూర్వము ఇంద్రుడు వృత్తాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మ హత్యా పాతకము కలిగెను. అందువలన అతడు అపవిత్రుడయ్యెను. ఆయనను ఆకలి దప్పులు భాధింపసాగెను . దేవతలూ తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగోదకములచే మంత్ర పూరితమైన కలశోదికములచే స్నానము చేయించిరి. అందువలన అతని అపవిత్రత ఆకలిబాధ తొలగెను. ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరముకు ఏర్పడిన అశుచిత్వము అకలిబాధా పోవుట వలన దేవతలూ ఋషులు మిక్కిలి ఆనందపడిరి'.

'అపవిత్రత ఆకలిబాధ తొలగి శుచియగుటకు ఇంద్రుడు సంతసించి ఈ దేశమునకు అత్యుత్తమమైన వరము ప్రసాదించెను. " నాశరీర మాలిన్యములు తొలగించిన ఈ రెందు ప్రదేశములు 'మలద' 'కరూశ' అను పేరులతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుచుండును"అని . శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమమైన వరము నిచ్చి ఆదరించుటను చూచి దేవతలందరూ 'బాగు ' 'బాగు' అని ప్రశంశించిరి. ఓ శత్రు సంహారకా రామా! 'మలద' 'కరూశ' అను ఈ ప్రదేశములు అట్లు ధనధాన్య సంపదలతో చిరకాలము వర్ధిల్లినవి'.

కొంత కాలము తరువాత పుట్టినపుడే వేయి ఏనుగుల బలము కలదియూ, కామరూపిణీ అయిన తాటక అను యక్షిణీ ఇచట నివశించెను. ఆమె బలశాలి అయిన 'సుందుడు' అనువానికి భార్య అయ్యెను. రామా! నీకు భద్రమగుగాక. ఆ తాటకికి మారీచుడు అనబడు రాక్షసుడు పుత్త్రుడుగా గలిగెను. అతడు ఇంద్రునివంటి పరాక్రమము గలవాడు. అతని బాహువులు బలిష్ఠమైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలమైనవి. భయంకరుడైన ఆరాక్షసుడు ఎల్లప్పుడూ ప్రజలను బాధింపసాగెను.

'ఓ రామా దుష్టచారిణి అగు తాటక 'మలద' 'కరూశ' అను ఈ రెండు జనపదములను ధ్వంసమొనర్చుచున్నది. ఇచటికి ఒకటిన్నర యోజనముల దూరమున ఆ తాటకి ఈ దారిని ఆక్రమించి నివశించుచున్నది. అందువలన మనము ఆ తాటక యున్న దారిలోనే వెళ్ళవలెను. నీ బాహుబలము ఉపయోగించి ఆ దుష్టచారిణిని వధింపుము . నామాటను పాటించి ఈ దేశమును ఇదివఱకు వలె ఉపద్రవములు లేకుండా చేయుము'.

'ఓ రామా! ఘోరమైన అసహ్యకరమైన ఈ యక్షిణి ధ్వంసమొనర్చిన ఈ దేశమునకు ఎవ్వరునూ రాజాలకున్నారు ".

'ఓ రామా ! ఈ దేశమును తాటక ద్వంసమొనర్చిన తీరును , తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధానమును తెలిపితిని . ఈ తాటకి ఇప్పటికిని ఈ అడవిని విడిచిపెట్టలేదు.'

ఈ విధముగా బాలకాండ లోని ఇరువదినాలుగవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||

ఏతత్ తే సర్వమాఖ్యాతుం యథైతద్దారుణం వనమ్ |
యక్ష్యా చోత్సాదితం సర్వం అద్యాపి న నివర్తతే ||

తా|| 'ఈ దేశమును తాటక ద్వంసమొనర్చిన తీరును , తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధానమును తెలిపితిని . ఈ తాటకి ఇప్పటికిని ఈ అడవిని విడిచిపెట్టలేదు.'

||ఓమ్ తత్ సత్||

 


|| om tat sat ||